Geetha Koumudi-1    Chapters   

ఎనిమిదవ కిరణము

అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియేనా ?

(గీత - 1వ అధ్యాయము)

అర్జునుడు తనవిషాదములో వ్యక్తముచేసిన 8భావములను విమర్శించి చూచినయెడల వానిలో 2వది అయిన వైరాగ్యమున్ను, 8వది అయిన ముముక్షుత్వమున్ను మాత్రమే శాస్త్రీయమైనవనిన్నీ, మిగతా 6 శాస్త్రవిరుద్ధమనిన్నీ గోచరించును. ఈవైరాగ్యము, ముముక్షుత్వము, సాధన చతుష్ట యసంపత్తిలో చేరినవై యున్నవి. బ్రహ్మ విద్యకు అధికారి నిరూపణము చేయుటలో శాస్త్రము సాధన చతుష్టయసంపత్తి కలవాడే అధికారి అని వక్కాణించినదికదా. ఇప్పుడు అర్జునునికి కల్గిన విషాదమునకు హేతువు శరీరమే. ఆత్మ అను అజ్ఞానము. యుద్ధములో చనిపోవునది శరీరములుకాని ఆత్మకాదు. శరీరము చనిపోతే శరీరంలో ఉన్న ఆత్మకూడ చనిపోతుంది అను అజ్ఞానంవల్ల అర్జునునికి విషాదము కల్గినది. ఇట్టి అజ్ఞానమును పోగొట్టుటకు ఆత్మ విద్య లేక బ్రహ్మవిద్యనే బోధించవలెను. ఇట్టి బ్రహ్మవిద్యను అధికారియైన వానికే బోధించవలెను. అధికారి కాని వానికి బోధించకూడదుకదా. కాని కృష్ణపరమాత్మ అర్జునునికి 2వ అధ్యాయములో 11వ శ్లోకమునుంచి ప్రారంభించి బ్రహ్మవిద్యను బోధించినాడు. కృష్ణపరమాత్మ అంతటివాడు అధికారం లేనివానికి బోధింపడు కనుకను, ఇప్పుడు అర్జునునికి బోధించినాడు కనుకను, అర్జునుడు అధికారి అయి ఉండవలెను అని తేలుచున్నది. అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియే అనుటకు ఇదియొక హేతువు.

ఇదికాక అర్జునునికి సాధన చతుష్టయసంపత్తి ఉన్నట్లు అర్జునుడు విషాదంలో వ్యక్తం చేసిన వైరాగ్య ముముక్షుత్వ ములవల్ల కూడ మనము నిశ్చయించవచ్చును.

సాధన చతుష్టయసంపత్తి అనగా (1) నిత్యానిత్య వస్తువివేకము. (2) ఇహాముత్రార్థ ఫలభోగవిరాగము, (3) శమదమాది షట్కసంపత్తి, (4) ముముక్షుత్వము అను నాలుగు అయ్యున్నవి.

1. నిత్యానిత్య వస్తువివేకము :- అనగా నిత్యమైన దేది, అనిత్యమైన దేది అను విచారణమీద తేలిన విజ్ఞానము లేక వివేకము. అట్టి విచారణమీద ప్రపంచములోనిదంతయు ప్రతినిత్యము మారుచున్నది కనుక అనిత్యమైనదే; బ్రహ్మ వస్తువు ఒక్కటే ఎప్పుడు ఎట్టి మార్పులేకుండా నిత్యమైనది అని తేలును. ఇట్లు బ్రహ్మ ఒక్కటిమాత్రమే నిత్యమైన దనిన్నీ, ప్రపంచమంతయు అనిత్యమైనదనిన్నీ అను వివేకము మొదటి సాధనము.

2. ఇహాముత్రార్థ ఫలభోగవిరాగము :- అనగా ఇహలోక భోగములందును, పరలోక భోగములు అనగా స్వర్గాదిలోక భోగములందును పూర్తియైన వైరాగ్యము.

3. శమదమాది షట్కసంపత్తి :- (1) శమము అనగా అంతరింద్రియ నిగ్రహము. (2) దమము అనగా బహిరింద్రియ నిగ్రహము 3 తితీక్ష అనగా శీతోష్ణాది ద్వంద్వములను సహించుట. (4) ఉపరతి అనగా ప్రపంచవిషయములందు మనసును పోనివ్వకుండుట లేక సన్యాసము. (5) శ్రద్ధ అనగా ఉపనిషద్వాక్యములందును గురువాక్యము లందు విశ్వాసము. (6) సమాధానము అనగా మనసులో ఎట్టి ఉద్వేగము లేని ప్రశాంతస్థితి. ఈ ఆరుకలసి షట్కసంపత్తి.

4. ముముక్షుత్వము :- అనగా ఈ సంసారబంధములోనుంచి బయటపడవలెను అను తీవ్రమైన వాంఛ.

ఈ నాలుగింటిలోనూ మొదటి రెండును అనగా వివేక వైరాగ్యములు బాహ్యప్రపంచము వల్ల కలుగు విక్షేపములను నివారించును. మిగతా రెండును అనగా షట్కసంపత్తి ముముక్షుత్వములు అంతఃకరణలోని విక్షేపములను నివారించును. వివేకము కల్గినందుకు ఫలము వైరాగ్యమే కనుక, వైరాగ్యము ఉన్నదంటే వివేకము ఉన్నట్లే. షట్క సంపత్తికి ఫలము ముముక్షుత్వమే కనుక మముక్షుత్వము ఉన్నదంటే షట్కసంపత్తి ఉన్నట్లే. అర్జునుడు తన విషాదములో వైరాగ్యమును ముముక్షుత్వమును వ్యక్తము చేసినాడు కనుక మిగతా రెండును ఉన్నట్లే. కనుక అర్జునునికి సాధన చతుష్టయసంపత్తి ఉన్నదని తేలినది.

ఇంకను బ్రహ్మవిద్యకు అధికారులు : (1) ఉత్తమాధికారులు (2) మధ్యమాధికారులు (3) అధమాధికారులు అని 3 రకాలుగా ఉన్నారు. తాత్కాలికంగా నైననూ వివేక వైరాగ్యాదులు కలవారు అధమాధికారులు. అంత కంటె ధృడంగా కలవారు మధ్యమాధికారులు. వివేకాదులను సంపూర్తిగా కలవారు ఉత్తమాధికారులు, అధమాధికారులు గురువుయొద్ద బ్రహ్మవిద్యను శ్రవణముచేసి అభ్యసించినచో మధ్యమాధికారులయి, క్రమేణా ఉత్తమాధికారులుకూడ అగుదురు. మధ్యమాధికారులు బ్రహ్మవిద్యను శ్రవణం చేసి అభ్యసించినచో ఉత్తమాధికారు లగుదురు. ఉత్తమాధికారులు శ్రవణము చేసి అభ్యసించినచో వెంటనే ముక్తులగుదురు. అర్జునుని చరిత్రనుబట్టి అర్జునుడు ఉత్తమాధికారి యగునా కాదా అను విషయమై ఒకవేళ ఎవరికైనా సంశయము కల్గినను, మధ్యమాధికారియో లేక అధమాధికారియో అయి తీరును అను విషయమై ఎవరికినీ సంశయ ముండనేరదు. అందుకనే శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ భాష్యములో 'అర్జునం నిమిత్తీకృత్య ఆహభగవాన్‌ అశోబ్యాని, అని వాక్రుచ్చినారు. శ్రీ కృష్ణార్జునులు నరనారాయణావతారులని శాస్త్రము చెప్పుచున్నది కనుక అర్జునుడు నరావతార మని స్పష్టమగుచున్నది. కనుక అర్జునుని చరిత్రలో అర్జునుడు ఉత్తమాధికారి అనుటకు విరుద్ధములగు అంశములు కనబడినను, అవి నృవిడంబములని సమన్వయము చేసుకోవచ్చును. కనుక అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియే అని నిశ్చయించవచ్చును.

___

Geetha Koumudi-1    Chapters